వసంత పంచమి/ Vasanta Panchami


శ్రీకరమైన జ్ఞానదీప్తిని పెంపొందించి, బుద్ధిశక్తిని ధీయుక్తిని ప్రసాదించే మాతృశక్తి స్వరూపిణి సరస్వతి. సమస్త సంపదలకు మూలభూమిక- విద్య. లౌకికపరమైన, ఆధ్యాత్మికమైన బ్రహ్మవిద్యకు అధిష్ఠాత్రి- శ్రీవాణి. ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ, చైతన్యం, వాక్పటిమ, ఏకాగ్రత, కళావైదుష్యం వంటి అంశాల్ని శ్రీవిద్యగా భారతి అనుగ్రహిస్తుందంటారు. ‘సరస్వతి’ అనే శబ్దానికి సర్వత్రా వ్యాపించిన శక్తి అని అర్థం. మనలో వెల్లివిరిసే, సర్వ అణువుల్లో వ్యాపించి ఉన్న జీవశక్తే సరస్వతి అంశ. జీవుల్లోనే కాకుండా, సకల సృష్టిలో సజీవకళకు ప్రతిరూపంగా సరస్వతిని సమార్చన చేస్తారు. జ్ఞానమే అసలైన సంపద. ఆ సంపదల్ని సంతుష్టిగా అందించే సత్వగుణ స్వరూపిణి సరస్వతీదేవి. మాఘశుద్ధ పంచమినాడు విద్యా వరదాయినిగా అభివ్యక్తమైందంటారు. ఈ విశేషమైన పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, విద్యాపంచమి, మదన పంచమి, దివ్య పంచమి, మహాపంచమిగా వ్యవహరిస్తారు.

మకర సంక్రమణం తరవాత క్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో వ్యక్తమవుతుంటాయి. చైత్రంతో విచ్చేసే వసంతానికి శిశిరంలో శుభస్వాగతాన్ని పలికే రుతుసంబంధిత పర్వదినం వసంతపంచమి. సరస్వతి జన్మదినోత్సవంగా నిర్వహించే ఈ వేడుకకు ఉత్తర భారతదేశంలో విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా బెంగాలీలు వసంత పంచమిని ఘనంగా జరుపుకొంటారు. ‘సరస్వతీమాత పూజ’ను శ్రీపంచమి రోజు నిర్వహిస్తారు. పుస్తకాల్ని, కలాల్ని పూజిస్తారు. శ్రీ పంచమినాడు లక్ష్మీ సరస్వతుల్ని జంటగా ఆరాధించడం ద్వారా లౌకిక సంపద, జ్ఞానశక్తి వృద్ధిచెందుతాయని పురుషార్థ చింతామణి చెబుతోంది.

సరస్వతి వేద విద్య సముల్లాసిని. జ్ఞానానంద పరాశక్తి.‘ప్రణోదేవి సరస్వతి’- అంటూ రుగ్వేదం చదువుల తల్లిని కీర్తించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి- స్వరూపాల సమ్మేళనమే శారద. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది, గుణదాయిని అనేవి సరస్వతి దివ్య అంశలు. వీటినే సారస్వత శక్తులుగా విశ్లేషిస్తారు. ఘన సారస్వతమూర్తిగా సరస్వతిని విరాట్‌ రూపంలో దర్శిస్తారు.


విష్ణుధర్మోత్తర పురాణం సరస్వతీదేవి యశస్సును, తేజస్సును సవివరంగా విశ్లేషించింది. ఆమె నాలుగు చేతులు నాలుగు దిక్కుల్లో వ్యాపించిన శక్తితత్త్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. విద్యాదేవిధరించిన పుస్తకం మోక్షవిద్యకు సంకేతం.కమండలం అఖిల శాస్త్రాల సారం. అక్షమాల అనంత కాలానికి ప్రతిబింబం. యోగశాస్త్రరీత్యా మన శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఉన్న భాగం వీణ రూపాన్ని పోలి ఉంటుంది. ఈ దేహమనే విపంచిని శ్రావ్యంగా రవళింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక, యోగశక్తుల్ని ఉద్దీపనం చేయమని శ్రీవాణిని ప్రార్థించాలని ‘శారదా తిలకం’ గ్రంథం వివరించింది.

శ్రీపంచమి పర్వదినాన సరస్వతీదేవిని ఆరాధించాల్సిన విధుల్ని శ్రీమన్నారాయణుడు నారదుడికి వివరించినట్లుగా దేవీ భాగవతం చెబుతోంది. తెల్లటి పువ్వులతో అష్టోత్తర సహితంగా బ్రాహ్మణిని పూజించి, క్షీరాన్నాన్ని నివేదన చేస్తారు. విద్యార్థులకు నూతన పుస్తకాల్ని బహూకరిస్తారు. బాల బాలికలకు అక్షరాభ్యాస వేడుకను శ్రీపంచమినాడు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. హంసవాహినిగా, అహింసా దేవతగా వర్థిల్లుతున్న శ్రీవాణి చెంత ఉండే హంస నీటిని విసర్జించి, పాలను స్వీకరించినట్టు- వ్యక్తులు చెడును త్యజించి, మంచిని స్వీకరించాలని సందేశమిస్తుంది. విద్యాసారాన్ని అందించే శారదాంబగా, వాక్‌శక్తికి అధిష్ఠాన దేవతగా, పరావిద్యను అందించే శ్రీవిద్యగా, బ్రహ్మమానస సంచారిణి బ్రాహ్మిగా, విజ్ఞాన పెన్నిధి జ్ఞానవల్లిగా  పలు రీతులలో సరస్వతీదేవి తన విరాట్‌ వైభవాన్ని వ్యక్తీకరిస్తుంది. జీవన గమనంలో సమగ్ర జ్ఞానలబ్ధి, విద్యాసిద్ధి, సర్వతోముఖాభివృద్ధి సాకారం కావాలంటే సరస్వతి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు.

Comments

Popular posts from this blog

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas

సుందరకాండ లఘుపారాయణ - Sunderakanda Song