ఉత్తర ద్వారము.

ఉత్తర ద్వారము.
ఉత్తరద్వారం నుంచి వెడుతుంటే మనకి వైకుంఠం గ్యారంటీ అనిపిస్తుంది. అంతమాత్రానికే గ్యారంటీ అయితే కాదనంకాదు కాని దాని వల్ల పాపాలు మాత్రం పోతాయి. అందులో సందేహం లేదు. కాని వైకుంఠానికి ఒకటే ద్వారం ఉందా? ఇది కొద్దిగా ఆలోచించవలసిన అంశం. ఆ పదాలని మనం శాస్త్రీయమైన అర్ధంతో చూస్తే అద్భుతమైన జ్ఞానం వస్తుంది.

ఉత్తరద్వారం - మిగిలిన మూడు ద్వారాలు లేక కాదు కాని వాటి ప్రవేశం వేరు. ఉత్తరద్వారం - ఉత్తరం అంటే జ్ఞానద్వారం. ఉత్తరం అంటే north అనేకాకుండా గొప్పది, ఉన్నతమైనది అని అర్ధం కూడా. సూర్యభగవానుడి గురించి చెప్తూ వేదం ఉత్తరాం దివం దేవః అని వర్ణించింది. ఉత్తరాం అంటే ఉన్నతం. ఉత్-తరాం. ఉత్-అంటే ఉత్కృష్టమైనదని అర్థం. ఉత్ - ఉత్తర - ఉత్తమ.

ఉత్తర అంటే గొప్పదని అర్ధం. ఉత్తరద్వారం అంటే గొప్పదైన ద్వారం. ఏ ద్వారం గుండా వెడితే పరమాత్మ వద్ద స్థిరంగా ఉండగలమో ఆ ద్వారం ఉత్తరద్వారం. అది జ్ఞానద్వారం. దాని లోంచి వెళ్ళగలిగేది ఎవరంటే శుద్ధసత్వసంపన్నులైన బ్రహ్మజ్ఞానులు మాత్రమే వెళ్ళగలరు.  ఇతరులు వెళ్ళలేరు. వారు ఉత్తరద్వారం గుండా వెడమని ప్రయత్నిస్తుంటే ఆ జ్ఞానాన్ని అడ్డుకున్నవాళ్ళు ఇద్దరున్నారు. అవి రజోగుణం, తమోగుణం ఇవి అడ్డుకుంటూ ఉంటాయి.

సాయుజ్యమోక్షమన్నది ఏదైతే ఉందో అది పరమాత్మలో లయమయ్యేవరకూ ఇంకా కొంచెం దూరం ఉంటూ ఉంటుంది. అందుకే అద్వైతం ఆ మోక్షాన్ని సంపూర్ణంగా ఒప్పుకోవు. దీన్నే భాగవతంలో చెప్తూ రసత్తమోదూషితులు అని జయవిజయులని వర్ణించారు. వాళ్ళు సత్వగుణాన్ని ఉత్తరద్వారంలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారుట.

మనలో కూడా సత్వగుణం సనకసనందాదులవలే భగవంతుడు వైపుకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే మనలో ఉన్న రజోగుణతమోగుణాలు వెళ్ళనివ్వకుండా తోసేస్తూ ఉన్నాయి. అప్పుడు మనం వాటిని ప్రయత్నపూర్వకం క్రిందకి అణచెయ్యాలి. అప్పుడే స్వామే వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. అది ఆ కథలో ఉన్న అసలు అంతరార్ధం.

ఉత్తరద్వారం తెరుచుకోవడమంటే జ్ఞానకవాటం తెరుచుకోవడం. అది తెరుచుకోవాలంటే రజోగుణ తమోగుణాలని తొలగించాలి. అదే అసలైన ఉత్తరద్వారప్రవేశం. అప్పుడే విష్ణుదర్శనం లభిస్తుంది.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas