ఇంటి ముంగిట ముగ్గులు
🙏
ఇంటి ముంగిట ముగ్గులు పెట్టటమన్నది మన హైందవ సంప్రదాయం. పూర్వ కాలంలో ఇంటి ముందు కళ్ళాపి చల్లి బియ్యం పిండి తో ముగ్గులు పెట్టేవారు. చీమలలాంటి జీవాలకి ఆ బియ్యం పిండి ఆహారం గా ఉపయోగపడేది.
ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకూ ప్రత్యేకంగా .పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దేవారు. వాటిని కూడా బియ్యం పిండి తో వేసి పసుపు కుంకుమలతో అలంకరించేవారు.
ధనుర్మాసం శివకేశవులిద్దరికీ ప్రియమైన మాసము. ధనుర్మాసం లో సాక్షాత్తు గా జగన్మాత గోదాదేవి శ్రీ రంగనాథస్వామి ని పరిణయమాడటం కోసం వ్రతమాచరించి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బెమ్మల రూపంలో గోపికల నర్చించి అందరికీ ఆదర్శవంతురాలయింది. సంక్రాంతి కి పంటలు ఇంటికొచ్చి ఇంటిల్లిపాదీ ఆనందం గా ఉండే సమయం కనుక సంక్రాంతి పౌష్యలక్ష్మిని అందమైన రంగవల్లులతో స్వాగతిస్తారు. ఈ మధ్య కాలంలో ముగ్గుపిండితో- సున్నంతో ముగ్గులు వేస్తున్నారు. ఆ సున్నం ఘాటుకి చలికాలంలో ప్రబలే క్రిమి కీటకాలు నశించిపోతాయి.
ముగ్గులలో అనేక రకాలున్నాయి. గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు.
ఆ రోజు ఉన్న తిథి వారాలను బట్టి తత్సంబంధిత దేవతలకు ప్రీతికరమైన ముగ్గులు వేస్తారు. పద్మాల ముగ్గులు, చిలకల ముగ్గులు, నెమళ్ళ ముగ్గులు, పూలసజ్జల ముగ్గులు, జ్యోతులముగ్గులు, మల్లెపందిరి ముగ్గు, తాబేలు ముగ్గు, నాగముగ్గులు, భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో వేసే ప్రత్యేకమైన గీతల ముగ్గులు ఇంకా ఎన్నెన్నో రకాల ముగ్గులు.
సాధారణమైన రోజులలో కూడా అందరూ నవగ్రహ ముగ్గుని వేస్తారు.
సంక్రాంతి పండుగ నాడు శ్రీ సూర్య నారాయణ స్వామిని ఆహ్వానిస్తూ రథం ముగ్గు ని ఇంట్లోకి వస్తున్నట్లుగా వేస్తారు. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని లోకులందరి హితం కోసం సాగనంపుతున్నట్లుగా బైటికి వెళుతున్నట్లుగా వేస్తారు.
ఎవరి ఇంటి ముందు ముగ్గులు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది.
ధనుర్మాసమంతా వంగి కూర్చుని పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులతో అలంకరించటం వలన శరీరానికి చక్కని వ్యాయామం జరిగి ఆరోగ్యం గా ఉంటారు.
చాలా పాఠశాలలలోను, కళాశాలలలోను, మహిళా సంఘాలలోను మహిళలకు ముగ్గుల పోటీలు పెడతారు. దానివల్ల ఒకరిని చూసి మరొకరు కొత్త కొత్తముగ్గులు వేయటం నేర్చుకుని మన సంప్రదాయంలో భాగమైన ఈ కళ వృధ్ధి చెందుతుంది.
🙏
Comments
Post a Comment