సుందరకాండ లఘుపారాయణ - Sunderakanda Song

సుందరమైనది సుందరకాండ 
సుందర మెంతో సుందరము..| 
మారుతి విజయం మరి మరి వినగా 
మనసే పరవశ మొందెనుగా|| 

సుగ్రీవుండను వానర రాజు 
శ్రీరాముని ప్రియ మిత్రుండు | 
సీతను వేడుకగా నలుదిక్కులకు 
వానర సేనను పంపెనుగా||1|| 

నలుడు నీలుడు జాంబవంతుడు 
జాతి సుతుడగు అంగడు..| 
హనుమంతుడు.. వెంటరాగా 
దక్షిణ దిక్కుగా పయనించే ||2|| 

శత యోజనముల విస్తీర్ణముగల 
సంద్రము నెట్టుల దాటుదము| 
జానకి నెట్టుల చూచెద మనుచు 
దుఃఖము నొందిరి కపివరులు||3|| 

అతి భీకరమగు సంద్రము దాటగ 
అంజని సుతునికి తగుననుచు| 
ఉత్సాహంబును కలుగ జేసిరి 
హనుమను అందరు కీర్తించి ||4||                                                                                 ||సుందర||

ఆంజనేయుడు మహేంద్రగిరిని 
కరచరణంబుల మర్ధించి| 
దేహము పెంచి అతివేగంబున 
ఆకాశంబున విహరించె|| 5|| 

కృత యుగంబున పర్వతంబులు 
రెక్కలు కలిగి గగనమున| 
విహరించుచు భయ బ్రాంతులు గొల్పగ 
మునులా ఇంద్రుని ప్రాదించె || 6 || 

దేవరాజు తన వజ్రాయుధముతో 
అన్నీ రెక్కలు ఖండింప| 
మైనకంబను గిరి రాజంబును 
వాయుదేవుడే కాపాడే || 7 ||  

పాతాళంబున వశించు దనుజులు 
పైలోకములకు రాకుండా| 
అడ్డుగా నిలచిన ఆ మైనకుని 
సాగరుడంతట పిలిచెనుగా|| 8 ||                                                                                   ||సుందర||

మారుతి మనకు ఆత్మ బంధువు 
ఆతనిని సన్మానింపు మన| 
అలసట తీరగ నపై నిలుమని 
ఎదురుగా నిలిచెను గిరిరాజు || 9 || 

అనిల కుమారుడు ఆనందించి 
జానకి మాతను చూచిన గాని| 
విశ్రమించనని బయలు దెరగ 
సంతసించిరా దేవతలు ||10 || 

మునులంతా ఆ పవనాత్మజుని 
దీక్షను పరీక్ష చేయగను |
నాగజనని ఆ సురసదేవిని 
ప్రార్థన చేసి పంపిరిగా || 11 || 

వికృత రూపము దాల్చిన సురస 
గుహవాలె నోటిని తేరిచెనుగా| 
నోటిని దాటి పోలేరెవరని 
హనుమకు అడ్డుగా నిలిచెనుగా || 12 ||                                                                                 ||సుందర||
 
సూక్ష్మ రూపమును దరించి మారుతి 
సురసనోటిలో చొచ్చుకొని | 
అతివేగంబున బయటకు వెడలగ 
గంధర్వాదులు హర్షించే || 13 || 

మేని నీడను పట్టి లాగెడి 
సింహిక యనెడి రక్కసిని|  
సంహరించి ఆ సమీర సూతుడు 
సాగర తీరము చేరెనుగా || 14 ||   

త్రికూట పర్వత శిఖరమునున్న 
లంకను చేరి లంకిణిని| 
జయించి హనుమ సూక్ష్మరూపియై 
రావణ గృహమున వేదికెనుగా || 15 || 

మేడలు మిద్దెలు నివాస గృహములు 
అంతఃపురములు హర్యములు| 
భవనంబులను వెదకిన హనుమ
జానకి జాడను కానడాయ్యె ||16 ||                                                                                ||సుందర||

అశోక వనిలో వృక్షము క్రిందను 
రక్కసి మూకల మధ్యనను| 
చిక్కినను, బహు చక్కగా నున్నా 
సీత మాతను చూచెనుగా || 17 || 

అతి దుక్కితయగు ఆ వైదేహిని 
తననే వరించి చేరుమని| 
భాదించెడి రావణుని చూచెను 
మారుతి వృక్షము పై నుండి || 18 || 

రాణులు ధర్మము లెన్ని చెప్పినను 
రావణుడెమియు వినకుండె|  
మనసే మారని ఆ సీతమ్మకు 
రెండు మాసములు గడువిచ్చే ||19 ||  

రాక్షస వనితల కఠినపు మాటలు 
రాముని సతిని భాదింప| 
త్రిజటయనెడి ఓక రాక్షస వనిత 
స్వప్నము కాంచితినని తెలిపె || 20 ||                                                                              ||సుందర||

లంకానాథుని అపజయంబును 
రామచంద్రుని విజయమును | 
కలగంటినని సీతకు తెలుపు 
శుభ శకునంబులు మొదలైయ్యె || 21 || 

రామ లక్ష్మణుల గుణ గణములను 
గానము చేసి హనుమయ్య| 
రామదూతనని విదేహ పుత్రిని 
నమ్మింపగ నిజ రూపము నిలచె || 22 || 

అమ్మ రాముడు నీ విరహమున 
అన్న పానములు లేకుండా| 
అతి దుఃఖితుడై ఈ ఉంగరమును 
అనువాలుగా పంపెనుగా || 23 || 

హనుమ పలుకులు విన్న జానకి 
ఆనందములో మునిగెనుగా| 
సాగర లంగన చేసిన నీవు 
మహాను భావుడవని పొగిడే || 24 ||                                                                               ||సుందర||

సుగ్రీవాది వానర సేనతో 
లంకను చేరి రావణుని | 
సంహరించి నను చేరదీయమని 
రామచంద్రునకు తెలుపుమనే || 25 || 

సీతమ్మయు తన ఆనవాలుగా 
కాకాసురుని కదా తెలిపి | 
చూడామణినీ శ్రీరామునకు 
అందచేయమని పలికెనుగా || 26 || 

అంజనీ సుతుడు ఆనందముతో 
వృక్షములన్ని విరచివేసి| 
అశోక వనినీ ధ్వంసము చేసి 
రావణ సేనను వధియించె || 27 || 

రావణ సుతుడగు అక్షకుమారుడు 
మంత్రి పుత్రులన్ కింకరులన్| 
వధియించిన ఆ వాయు పుత్రుడు 
మేఘనాధునితో తలపడెను || 28 || '                                                                                 ||సుందర||

బ్రహ్మాస్త్రముతో మేఘనాధుడు 
మారుతి నప్పుడు బంధించి | 
రావణ సభలో ప్రవేశ పెట్టగ 
రావణుడేంతో మండిపడే || 29 ||   

సీతమ్మను శ్రీరామునికిచ్చి 
రాముని శరణు వేడుమనే |
రామ దూతగా వచ్చితినన్నను 
హనుమంతుని హతమార్చమనే || 30 || 

దూతను చంపుట పాపమనుచు 
వీభీషణాదులు తెలుపగనూ| 
వానరులకు అతి ప్రియమైన 
తోకను కాల్చగ నియమించె || 31 || 

రాక్షసులంతట నునె చీరలను 
తోకాకు చుట్టి నిప్పంటించి | 
హనుమను వీదుల త్రిప్పుచు నుండ 
తోకతో ఇండ్లంకు నిప్పంటించే || 32 ||                                                                        ||సుందర||

అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను 
హనుమను చల్లగా చూచెనుగా| 
మైథిలియొక్క పాతివ్రత్యముకు 
అనలుడు ఎంతో చల్లబడే || 33 || 

మండుచున్న తన వాలముతోడను 
గృహముల నెన్నో కాల్చెనుగా | 
మనోజ్ఞమైన లంక నగరిని 
భస్మి పటలము గావించె || 34 ||   

హా పుత్రా! హా తండ్రి! యనుచు 
మరణించిన వారికై ఏడ్చుచునూ| 
రాక్షసులందరు రోదన చేయుచు
భయముతో పరుగులు పెట్టిరీగ || 35 || 

పవనాత్ముడు తన లాంగు లాగ్రమును 
సాగర మందున చల్లార్చి | 
భీభత్సముగ నున్న లంకను 
చూచి ఎంతయ్యో భీతిల్లే || 36 ||                                                                                  ||సుందర||

జానకి మాత ఎటులనున్నదో 
చూడకోరి హనుమయ్య | 
అతి త్వరితముగ వనమును చేరి 
సీతామాతకు ప్రణమిల్లె || 37 || 

రోహిణి చంద్రుని కలయు నట్లుగా 
రాముడు నిన్ను కలయుననే| 
శ్రీరాముడు అతి శీఘ్రముగా 
లంకానాధుని వధియించుననే|| 38 || 

జానకి తనకు ప్రియము చేసిన 
హనుమకు అలసట తీరగను| 
ఎందైనను ఆ రాతిరి గడిపి 
మరలిపొమ్మని తెలిపెనుగా || 39 ||   

అవలీలగా ఆ సంద్రము దాటి 
తన మిత్రులను చేరిన మారుతి| 
మధువని లోని మధువును గ్రోవి 
రాముని చెంతను నిలిచెనుగా || 40 || 

వెనువెంటనే మారుతి సీత క్షేమమును 
యదాతదంగా వినిపించి 
జానకి ఇచ్చిన చూడామణిని 
రఘు రామునికి అందంచె || 41 || 

చూచి రమ్మనిన కాల్చి వచ్చిన 
ఘనత నీకు దక్కెనుగా|  
హనుమయ్య నీ సాటెవరని 
సుగ్రీవాదులు కీర్తించిరి || 42 ||                                                                                            ||సుందర||

మా ఇలవేలుపు మారుతియే కదా 
తప్పులు క్షమింప కూరుచును | 
మారుతి కిదియె అంకితమనుచు 
మంగళ హారతి పాడెదను || 43 || 

రఘు రాముని నీ మనమున నిలిపిన 
మారుతీ నీకిదే మంగళము | 
నీ దాసులలో నను చేర్చమని 
మరి మరి నిన్నే వేడెదను || 44||                                                                                         ||సుందర||

Comments

Popular posts from this blog

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम