శ్రీ భువనేశ్వరీ మహా విద్య

శ్రీ భువనేశ్వరీ మహా విద్య

దశ మహా విద్యలలో 4వ మహా విద్య శ్రీ భువనేశ్వరీ దేవి. భువనేశ్వరి అంటే ఈ చతుర్ధశ భువనాలకీ అధీశ్వరి. పద్నాలుగు భువనాల్లోని చరాచర జీవరాసులన్నీ ఈ దేవి ఆధీనంలోనే ఉంటాయి. ఈ మహా విద్య పరమశాంతి రూపిణీ. మూల ప్రకృతి రెండో నామాన్ని భువనేశీ అంటారు. భువనేశీ అనగా భువనేశ్వరీ. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశీదేవివే.

నిత్య జీవితములో పరిపూర్ణమైన శాంతిని కోరుకునే వారు శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించాలి. శ్రీ భువనేశ్వరీ దేవికి రాత్రి సిద్ధరాత్రి కాగా, త్రయంబకుడు శివుడుగా, పరమేశ్వరుడు భైరవుడుగా, త్రైలోక్యమోహిని యక్షిణిగా ఉంటారు. 

ఆకాశానికి ఆధిదేవత భువనేశ్వరి అని తంత్ర గ్రంథృ఼లు వర్ణిస్తాయి. భువనేశ్వరీ దేవి నాదశరీరం హ్రీంకారం. అందుకే హ్రీం కారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరీ బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం (ఓం) అని, హృల్లేఖ అని కూడా అంటారు. ఈ దేవిని మహా మాయగా, ఈమె బీజం హ్రీం కారాన్ని మాయాబీజంగా సంభావిస్తారు.

భువనం అంటే లోకం. ఈ లోకానికి సృష్టికర్త భువనేశ్వరి. ఈ సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే. ఈమెనే అదితి అని కూడా అంటారు. అ+దితి అంటే ఖండం కానిదని అర్థం. ఈ అదితి దేవతలందరికీ మాతృమూర్తి. 

ఇక ఈ దేవికి పాయసం అంటే ఎంతో ప్రీతి. పాయసాన్న ప్రీతమానస అయిన ఈ దేవికి పాయసాన్ని నివేదిస్తే ఎంతో సంతోషిస్తుంది. 

హృల్లేఖా మంత్ర ప్రభావం
చతుర్థశభువనాధీశ్వరి అయిన భువనేశ్వరీ దేవి, దేవీ భాగవతంలో హిమవంతుడికి యోగా భోధి చేస్తూ.. తనను ఏ విధంగా ధ్యానించాలో ఇలా చెబుతుంది. 

హకారః స్థూలదేహః స్యాద్రకారః సూక్ష్మ దేహకః 
ఈకారః కారణాత్మా సౌ హ్రీం కారో హం తురీయకమ్
ఓ హిమవంతా మూడు అక్షరాలతో కూడిన నా దివ్య బీజాన్ని నీవు ధ్యానించాలి. నా స్థూలదేహమైన 'హ'కారాన్ని, నా సూక్ష్మ దేహమైన 'ర' కారాన్ని, నా కారణదేహమైన 'ఈ' కారాన్ని కలిపి 'హ్రీం' అనే ప్రణవ బీజంతో నన్ను ఉపాసించాలి. నాకు చేసే ప్రతి పూజా ఈ హృల్లేఖా మంత్రంతోనే చేయాలి.

హృల్లేఖా దర్పణే నిత్యమహం తత్ర్పతిబింబితా
తస్మాత్ హృల్లేఖయా దత్తం సర్వమంత్రైః సమర్పితమ్

హృల్లేఖ అంటే సర్వ మంత్రాలకూ నాయిక వంటిది. మంత్ర మహారాజ్ఞి అయిన హ్రీం అనే ఆ మంత్ర దర్పణం(అద్దం)లో నేను ప్రతి నిత్యం ప్రతిబింబించి ఉంటాను. అందుకే నాకు సమర్పించే పూజ, జపం, తపం.. అన్ని హృల్లేఖా మంత్రంతో సమర్పిస్తే అది సకల మంత్రాలతో సమర్పించినట్టవుతుంది. 

అందుచేత ఓ హిమవంతా నిత్యం హ్రీం బీజంతో భువనేశ్వరి అయిన నన్ను పూజిస్తూ, ఉపాసిస్తూ ఉండేవారికి లోకంలో దుర్లభమైనది ఏదీ ఉండదు. వారు శరీరం విడిచాక నా దివ్య చింతామణి గృహానికి చేరుకుంటారు. అని స్వయంగా చెప్పింది కనుక అత్యంత మహిమోపేతమైన ఈ భువనేశ్వరీ మహా విద్యని నియమపూరితంగా ఉపాసించి కృతార్థులు కావాలి...మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మిలలితా వస్తూ జ్యోతిష నిలయం* (భువనేస్వరి పీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas