మాతృపంచకం
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.
ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. అది తాత్పర్య సహితంగా ఇక్కడ ఇవ్వబడినది.
मुक्तामणिस्तवं नयनं ममेति
राजेति जीवेति चिर सुत त्वम् ।
इत्युक्तवत्यास्तव वाचि मातः
ददाम्यहं तण्डुलमेव शुष्कम् ॥ १॥
ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.
తాత్పర్యము:
అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.
अम्बेति तातेति शिवेति तस्मिन्
प्रसूतिकाले यदवोच उच्चैः ।
कृष्णेति गोविन्द हरे मुकुन्द
इति जनन्यै अहो रचितोऽयमञ्जलिः ॥ २॥
అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.
తాత్పర్యము:
పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
आस्तां तावदियं प्रसूतिसमये दुर्वारशूलव्यथा
नैरुच्यं तनुशोषणं मलमयी शय्या च संवत्सरी ।
एकस्यापि न गर्भभारभरणक्लेशस्य यस्याक्षमः
दातुं निष्कृतिमुन्नतोऽपि तनयस्तस्यै जनन्यै नमः ॥ ३॥
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.
తాత్పర్యము:
అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.
गुरुकुलमुपसृत्य स्वप्नकाले तु दृष्ट्वा
यतिसमुचितवेषं प्रारुदो त्वमुच्चैः ।
गुरुकुलमथ सर्वं प्रारुदत्ते समक्षं
सपदि चरणयोस्ते मातरस्तु प्रणामः ॥ ४॥
గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.
తాత్పర్యము:
కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను
न दत्तं मातस्ते मरणसमये तोयमपिवा
स्वधा वा नो दत्ता मरणदिवसे श्राद्धविधिना ।
न जप्त्वा मातस्ते मरणसमये तारकमनु-
रकाले सम्प्राप्ते मयि कुरु दयां मातुरतुलाम् ॥ ५॥
న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.
తాత్పర్యము:
అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే. సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ!
అమ్మా.....ఈ జన్మకు నువ్వే కదా అమ్మవు. ఈ రోజు నా శరీరం వుందంటే కారణం నువ్వే కదా. నువ్వు వెళ్లిపోయావు. గుర్తుగా ..ఇదిగో ఈ శరీరం మిగిలివుంది. ఇప్పటినుంచి ఐనా ఈ శరీరం ఆధారంగా, సాక్షిగా, మాత్రుశక్తులను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ఆదుకుంటాను.
ReplyDelete