Bhagyanagaram Temples

అడపాదడపా తిరుపతి, కాశీ, అరుణాచలం వంటి తీర్థయాత్రలు చేసే మనం, మన ఊళ్ళోనే మన భాగ్యనగరంలోనే  గొప్ప ప్రాచీన దేవాలయాలూ, ఎంతో ప్రాశస్థ్యాన్ని కలిగి పురాణ కథలతో కూడుకున్న ఆలాయాలున్నాయంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది.

హైదరాబాద్ లో మనకి తెలిసిన ఆలయాల వెనుక మనకి తెలియని కథలు ఎన్నో ఉన్నాయి. 

అందులో కొన్ని కథలు..

1) కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం.

1143 వ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు ఓ పులి గాండ్రింపు విని వేటాడుతూ ఈ ప్రాంతంలో కి రాగా, ఓ చెట్ల పొదల్లోంచి 'రాం' 'రాం' అని వినపడిందట. సైనికుల సహాయంతో అక్కడ వెతకగా హనుమత్ రూపం చెక్కబడిన రాయి కనబడిందిట. ఆయన యధాశక్తి పూజాదికాలు కావించి తన కోటకు మరలి వెళ్ళాడు. ఓ రాత్రి ఆంజనేయస్వామి కలలో కనపడి తనకి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తే ఆయన ఇక్క పెద్ద ఆలయం కట్టించినట్టు చరిత్రకారులు చెప్తారు.

17వ శతాబ్ధంలో ఔరంగజేబు దుర్మార్గంగా ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేయించాడు. 

ఈ ఆలయ ప్రాంతానికి వచ్చిన అతని సైనికులు గుడి కూలగొట్టడానికి పూనుకోగా చెవులు చిల్లులు పడేంత పెద్ద ధ్వని వినపడిందట. ఆ వింతవిని ఔరంగజేబే స్వయంగా ఇక్కడికి రాగా "నా గుడి కూలగొట్టాలంటే ముందు నీవు మనస్సు గట్టి చేసుకో (కర్ మన్ ఘట్) "  అని వినపడిందట. "నీవున్నది సత్యమైతే ఒక్కసారి నాకు కనిపించు " అని ప్రార్ధన చేసిన ఔరంగజేబుకి తాడిచెట్టంత పరిమాణంలో అద్భుతమైన కాంతిపుంజాలు విరజిమ్ముతూ ఆంజనేయస్వామి విగ్రహం క్షణకాలం కనపడి మాయమైందట. 

శిధిలమైన పాత గుడిని పునరుద్ధరించి అప్పటినించీ స్థానికులు ఘనంగా పూజాదికాలూ, ఉత్సవాలూ చేస్తున్నారని చెబుతారు. 

ఎల్బీ నగర్ నించీ శంషాబాద్ వెళ్ళే దారిలో ఉన్న కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం నిస్సందేహంగా ఓ మంచి పుణ్యక్షేత్రం.

2) టాడ్‌బండ్ వీరాంజనేయస్వామి ఆలయం

త్రేతాయుగానికి చెందిన ఆలయంగా ప్రసిద్ధి చెందినది ఈ వీరాంజనేయస్వామి ఆలయం.
జాబాలి మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించిగా ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రమని ప్రతీతి. 

ఆ మహర్షి ప్రార్ధించగా విఘ్నేశ్వరుదు ప్రత్యక్షమయ్యాడని తన తపస్సు అవిఘ్నంగా జరిగేలా ఆయనను కోరాడనీ పురాణ కథనం. గుళ్ళో ఉన్న వినాయకుడిప్రతిమని ఆయన ప్రత్యక్షమైనప్పుడు వెలిసిన విగ్రహంగా చెపుతారు. ఆంచేత, ఇక్కడి క్షేత్ర దర్శనం వల్ల సకల కార్యాలూ విఘ్నాల్లేకుండా విజయవంతమౌతాయని క్షేత్ర మహత్యం తెలుపుతోంది.  

19వ శతాబ్ధం లో నుతన ఆలయం నిర్మించి ఇప్పుడు మనకు దర్శనమిచ్చే విధంగా పునః ప్రతిష్ఠించారు. ఊళ్ళో సగం వాహనాలకి తాడ్‌బండ్ 
ఆంజనేయస్వామి స్టిక్కరే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రజలకి ఆయనపట్ల నమ్మిక ఆ స్వామికి ప్రజలపట్ల కరుణ బలంగా ఉన్నాయనడానికి ఆ స్టిక్కర్లే మంచి ఉదాహరణ.

3) చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం 

1940 లొ కట్టబడిన ప్రముఖ వేంకటేశ్వర ఆలయం ఇది.

పాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర నియమానుసారంగా జరిగే పూజలతో ఈ ఆలయం బిర్లా మందిర్ కీ, చిలుకూరు బాలాజీ ఆలయాలకి దీటుగా ప్రసిద్ధి చెందింది. 

సరిగ్గా పనులు అవ్వక వివిధ క్లేశాలతో బాధపడేవారూ, శని ప్రభావం తీవ్రంగా ఉన్నవారూ ఈ ఆలయానికి ఐదు శనివారాలు వెళ్ళి శ్రీవేంకటేశ్వరుని పాదాలు దర్శించుకుంటే అన్ని పరిస్థితులూ చక్కబడతాయని ప్రతీతి.   

ఇటీవలే చిక్కడపల్లిలో ఈ ఆలయానికి ఈశాన్యంగా ఉన్న ఇళ్ళమధ్యలో దాదాపు ఇరవై అడుగుల లోతుతో రాళ్ళతో కట్టబడిన పెద్ద పుష్కరిణి బయటపడేసరికి నిర్ఘాంతపోయిన స్థానికులు ఈ ఆలయానికి చాలా పాత చరిత్రే ఉండి ఉండచ్చని భావిస్తున్నారు.

4) కాశీబుగ్గ శివాలయం, కిషన్‌బాఘ్  

1822లో రాజా రాఘవ్ రామ్‌జీకి శ్రీ కృష్ణుడు కలలో కనిపించి ఆజ్ఞాపించగా నిర్మించిన మురళి మనోహర్ మందిర్ ఆలయంలో ఉన్న ఈ శివలింగం భూగర్భంలో ఉంటుంది. 

శ్రీ కృష్ణుడి ఆలయం కడుతూ ఉండగా ఈ కాశీ బుగ్గ శివలింగం కనిపించిందని,  15 మెట్ల లోతు లోపలికి తవ్వితే నిత్యం జల ఊరుతూ సహజంగా శివాభిషేకం అవుతూ ఉండడం ఈ ఆలయ విశేషం అని రాజా రాఘవ్ రామ్‌జీ వంశీకులు చెపుతూంటారు. 

మెట్లు దిగి అంతరాలయంలోకి వెళ్ళగానే కేవలం అరికాళ్ళు తడిసేంత మాత్రమే నీళ్ళు ఊరుతూ ఉంటాయి. శివలింగం చుట్టు నీళ్ళు పైకి చిమ్ముతూ సహజంగా  నిత్య  శివాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ నీళ్ళు మళ్ళీ ఒక తూముద్వారా దగ్గర్లో ఉన్న మూసీ నదిలొకి మళ్ళుతాయి. మూసీ నది ఎండిపొయినా, కాశీబుగ్గ ఆలయంలొ నీళ్ళ తడి ఇప్పటివరకూ ఆరలేదని ఆ ఆలయ ఫౌండర్లు చెపుతారు.   

ఆవిధంగా మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. 

అప్పుడప్పుడు పాములు చుట్టచుట్టుకుని కనిపించే ఈ శివలింగాన్ని ప్రజలు విరివిగా దర్శించకపోయినా భాగ్యనగరంలో ఉండే విశిష్ఠత గల ఆలయాల్లో ఇది ఒకటని కచ్చితంగా చెప్పచ్చు.

5) ఉజ్జయిని మహాకాళి ఆలయం, సికందరాబాద్ 

1813 లో అప్పటి భాగ్యనగరంలో కలరా వ్యాధి అనేకమంది ప్రాణాలను హరించింది. సురుటి అప్పయ్య అనే ఆయనకి మిలట్రీ లో డోలీ మోసే ఉద్యోగం వచ్చి  మధ్యప్రదేశ్ లో ఉజ్జయినికి బదిలీ అయ్యింది. అక్కడి మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన, తమ ప్రాంతంలో కలరా తగ్గితే మహాకాళి అమ్మవారి ఆలయాన్ని తమ ఊరిలో కట్టిస్తానని మొక్కుకున్నారు.  ఆ తరువాత ఆ మహమ్మారి తగ్గగానే, ఓ చెక్క మహాకాళి విగ్రహాన్ని చేయించి 1815 లో ఇప్పటి సికందరాబాద్ లో ప్రతిష్టించారు. 

ఆ తరువాత 1964 లో ఉజ్జయినీ నించి రాతి విగ్రహాన్ని తెచ్చి ప్రాణ ప్రతిష్ట చేస్తుండగా గర్భగుడిలో మాణిక్యాలమ్మ విగ్రహం బైటపడింది. మహాకాళి ఆలయం కట్టించాలని సంకల్పించిన చోటే ఇంకో అమ్మవారి విగ్రహం బయటపడటం అంతా అమ్మవారి లీల అని నమ్మిన అప్పయ్యగారి కుటుంబీకులు పక్కపక్కనే తమ శక్తి కొలది చిన్న చిన్న గుళ్ళని కట్టారు. 

దరిమిలా ఆ అమ్మవార్లు భక్తుల పాలిట కొంగుబంగారమై పరిపరి విధాలుగా ప్రజలని రక్షిస్తూ ఉన్నారు.  

ప్రతి యేటా బోనాలూ, దసరా పండగా ఘనంగా జరిపే ఇక్కడి ప్రజలు ఈ ఆలయంలోని అమ్మవార్లని అతి శక్తివంతమైన దేవతలుగా భావిస్తారు.    

6) బల్కంపేట యెల్లమ్మ తల్లి ఆలయం

జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి తల నరకమని ఆదేశిస్తే పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించాడు. ఆయన ధాటికి రేణుకాదేవితో పాటూ కొందరి మహిళల తలలు కూడా తెగి పడ్డాయనీ, తండ్రి ఇచ్చిన వరంతో అందరినీ బ్రతికించిన పరశురాముడు, పొరపాటున రేణుక తల ఇంకో మహిళకి అతికించాడనీ ఆమెయే పార్వతీ మాత అంశతో జగదాంబగా ఇక్కడ వెలిసిందనీ బల్కంపేట యెల్లమ్మ క్షేత్ర పురాణం. 

జగత్-అంబ అంటే యెల్లరికీ అమ్మ-యెల్లమ్మగా అమ్మవారు పేరు పొంది బల్కంపేటలో వెలసి భక్తులను రక్షిస్తోంది.  

ఇక్కడి అమ్మవారికి తాము ధర్మబద్ధంగా కోరిన కోరికలు తీరితే నిమ్మకాయల దండ వేస్తామని  మొక్కుకోవడం ఆచారం. 51, 21, 11 ఇలా యధాశక్తి నిమ్మ దండలను మొక్కిన ప్రకారం సమర్పించుకుంటారు. 

కాశీబుగ్గ ఆలయంలో లాగానే ఇక్కడ కూడా అమ్మవారి పాదాలను నిత్యం ఊరే జల అభిషేకం చేస్తూ ఉంటుంది. ఆ నీళ్ళే మనకి తీర్ధంగా ఇస్తారు.  

భాగ్యనగరంలో అతి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న శక్తి క్షేత్రాల్లో ఇది ఒకటి.

7) సికందరాబాద్ వినాయక ఆలయం

1824 లో నీళ్ళకోసం బావి తవ్వుతూండగా దొరికిన వినాయకుడి విగ్రహాన్ని అప్పటి సైనికులు ప్రతిష్టించి చిన్న గుడి కట్టించారు. 
ఆ తరువాత కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ ఆలయం బాగా వృద్ధి చెందింది. 

పెద్ద పెద్ద కార్యాలు తలపెట్టుకున్నప్పుడు ఈ వినాయకుడికి అభిషేకం చేయిస్తే విఘ్నాలు లేకుండా జయప్రదం అవుతాయని భక్తుల విశ్వాసం.

8) రామలింగేశ్వర స్వామి ఆలయం, కీసరగుట్ట

శ్రీ రాముడు శివలింగ ప్రతిష్ఠకు పూనుకుని హనుమంతుడిని శివలింగం తెమ్మని ఆదేశించగా ఆయన కాశీ వెళ్ళి ముహుర్తం వేళకి రాలేక పోతాడు. అప్పుడు పరమశివుడే ప్రత్యక్షమై శివలింగాన్ని రాముడికి ప్రసాదిస్తాడు. ఐతే తాను తెచ్చిన 101 శివలింగాలూ ప్రతిష్టకి నోచుకోలేదని అలిగిన హనుమ ఆ లింగాలను ఓ కొండపై విసిరేస్తాడు.

రాముడు ఆయన్ను బుజ్జగించి, ఆ క్షేత్రంలో శివునితోపాటూ ఆంజనేయునికి కూడా సమానంగా పూజలు జరుగుతాయనీ, ఆ క్షేత్రం శివపరమైనా ఆంజనేయుని పేరిట కేసరిగిరి గా ప్రఖ్యాత మవుతుందని వరమిస్తాడు. 

అదే ఈనాటి కీసరగుట్ట.

సాక్షాత్ శివుడే రామునికోసం వెలిసిన క్షేత్రం కాబట్టి పరమ పుణ్యస్థలంగా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తారు. అలాంటి క్షేత్రంలో ప్రస్తుతం శివాభిషేకానికి నీళ్ళు దొరక్కపోవడం అక్కడి అధికారుల నిర్లక్ష్యానికి సంకేతం. 

ఇక్కడున్న వేద పాఠశాలలో చిన్నచిన్న పిల్లలు వేదం నేర్చుకోవడం చూస్తే బహు ముచ్చటేస్తుంది. వాళ్ళకోసం మిఠాయిలూ, పళ్ళూ పట్టికెళ్ళి పంచుతూ ఉంటే గొప్ప సంతోషం వేస్తుంది.

9) సీతారామ స్వామి ఆలయం, అమ్మపల్లి, శమ్షాబాద్ 

వేంగి చాళుక్యులు సుమారు ఏడువందల సంవత్సరాల క్రిందట కట్టించిన అమ్మపల్లి సీతారామ స్వామి ఆలయం శమ్షాబాద్ ప్రాంతంలో గొప్ప ప్రాచుర్యాన్ని పొందింది. 

ఒకప్పుడు భద్రాచలం లో కన్నా ఇక్కడే సీతారముల కళ్యాణం చాలా ఘనంగా జరిగేదట. స్వామివారి కళ్యాణానికి ఓ పేద్ద మండపం, ఎదుర్కోళ్ళకు పెద్ద లాబీ లాంటి ఇంకో మండపం, 250 ఎకరాల స్థలంలో విశాలంగా కట్టిన గుళ్ళు మండపాలతో, పాతకాలం నాటి కట్టడంలా కనిపించే గాలిగోపురంతో, గోల్కొండకోటని పోలిన గట్టి ప్రహరీ గోడతో అలరారే ఈ ఆలయ దర్శనం గొప్ప ప్రశాంతతనీ, దివ్యానుభూతినీ ఇస్తుంది. 

ఇక్కడి ఆలయ ప్రాశస్థ్యాన్ని గుర్తించిన నిజాం రాజులు భారీగా నిధులివ్వడమే కాకుండా, స్థలాన్నిచ్చి కోటగోడలాంటి ప్రహరీ ని కట్టించారట.  

అసలు శంషాబాద్ లో ఇలాంటి ఆలయం ఉందా అనేలా మనకి విస్తు గొలిపే దేవాలయంగా అమ్మపల్లి సీతారామస్వామి గుడి మనకి మంచి అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు.

ఇదేవిధంగా మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్ లో సీతారాంబాఘ్ దేవాలయం హిందూ, ముస్లిం, జైన, సిక్కు మతస్థులందరి చేతా పూజలందుకుంటూ ఇక్కడి ప్రాంతానికి ఆధ్యాత్మిక సౌరభాలు విరజల్లుతోంది.

దైవ సంబంధ ఘటనలతో, కథలతో మన భాగ్యనగరం లో వెలసిన ఈ దివ్యాలయాలే కాకుండా, చిలుకూర్ బాలాజీ ఆలయం, బిర్లా మందిర్, జూబ్లీహిల్ల్స్ లో పూరీ జగన్నాథ్ ఆలయం మరియు టీటీడీవారి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఇస్కాన్ ఆలయాలు, పెద్దమ్మ గుడి, స్కందగిరి, స్వామి నారాయణ్ మందిర్ (చూడడానికి భలే కళగా ఉంటుందీ శ్రీ కృష్ణుడి ఆలయం ) వంటివి భక్తులు పూనుకుని కట్టించినవి మన ఊళ్ళో చాలానే ఉన్నాయి. 

మానవ సంకల్పంతో నిర్మితమైనా, ఈ ఆలయాలుకూడా ఎంతో ప్రసిద్ధి చెంది గొప్ప పుణ్య క్షేత్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. 
ఆ విధంగా చూస్తే మన భాగ్యనగరం మనం గుర్తించినా గుర్తించకపోయినా ఓ గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాల సమాహారం. 

మనవాళ్ళతో నాలుగు బళ్ళు ఒకదానికొకటి కూడకట్టుకుని సరదాగా ఒకట్రెండు రోజులపాటు ఇక్కడిక్కడే ఉండే గుళ్ళని దర్శిస్తే తీర్థయాత్రలు చేస్తే వచ్చే పుణ్యం, ఆహ్లాదం ప్రసాదించగల బహుచక్కటి దేవాలయాలివి.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas