శ్యామశాస్త్రిగారు/Sri Syamasastry
కర్ణాటక సంగీత మూర్తిత్రయం గురించి మీరువినే ఉంటారు..వారే...శ్యామశాస్త్రి,త్యాగరాజు,దీక్షితులు-వీరి ముగ్గురిలోశ్యామశాస్త్రిగారి రచనలు బహు కొద్దిగా సుమారు 300 వరకూ మాత్రమే ఉన్నాయి.వాటిలోనూ ప్రస్తుతం అందరికీ తెలిసినవి వందలోపే ఉంటాయి.సంఖ్యాపరంగా తక్కువ రచనలుచేసినా,మిగిలిన ఇరువురితో సమాన స్థానం శ్యామశాస్త్రిగారికి దక్కటం విశేషం.
తంజావూరులో వంశపారంపర్యంగా తమకు లభించిన బంగారుకామాక్షి ఆలయ అర్చకత్వ విధులు నిర్వర్తిస్తూ,పరమభక్తులైన శ్యామశాస్త్రిగారు,నిత్యం అమ్మవారితో జరిపిన సంభాషణే కృతులుగా మనకు లభించాయి.వర్ణాలు,స్వరజతులు కూడా శ్యామశాస్త్రిగారు చేశారు.భాషాపరంగా చాలా సరళంగా ఉన్నా,సంగీతపరంగా ఎంతో ఘనమైనవి వారి రచనలు.ముఖ్యంగా లయ జ్ఞానంలో అసామాన్యులు వారు.
వారి జీవితంలో జరిగిన ఒక ఘట్టం వివరిస్తాను...
అది తంజావూరు రాజాస్థానం.శరభోజి మహారాజుగారు కొలువుతీరి ఉన్నారు.సభలోకి ఒక సంగీత విద్వాంసుడు ప్రవేశించాడు.ఆయన ఆంధ్రదేశం నుండివచ్చిన 'భూలోక చాపచుట్టె'గా ప్రసిద్ధులైన బొబ్బిలి కేశవయ్యగారు.ఆయన లోకమంతా చుట్టబెడుతూ,తన సంగీత విద్వత్తుతో అనేక రాజాస్థానాలలోని విద్వాంసులను ఓడిస్తూ,వస్తున్నారు.తనవెంట ఓడిపోయినవారినుండి గ్రహించిన తంబురాలు,బిరుద పతకాలు,ఉన్నాయి.
కంచు ఢక్కామ్రోగిస్తూ,విద్యాగర్వంతో, 'నన్ను ఓడించే సత్తా ఈ తంజావూరు ఆస్థానంలో ఎవరికైనా ఉందా?' అని సవాలు విసిరారు.అప్పటికే ఆయన ప్రతిభ గురించి విన్న అక్కడి విద్వాంసులు, ఆయన పటాటోపంచూసి,భయపడ్డారు.ఎవరూ ఎదుర్కొనడానికి సాహసించలేదు.మరునాడు తిరిగివస్తానని,విజయపత్రం సిద్ధంచేయమని చెప్పి,నిష్క్రమించారాయన.
ఆరోజు సాయంత్రం,విద్వాంసులంతా సమావేశమై,తాము కేశవయ్యగారిని ఎదుర్కొనలేమని,అందుకు సమర్థులు ఒక్క శ్యామశాస్త్రిగారేనని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.అయితే...'మరియాదలెరుగని దుష్ప్రభుల కోరి వినుతింపను' అని ఆనందభైరవి రాగ కృతిలో చాటుకొని,రాజులకు,రాజాశ్రయాలకు దూరంగా ఉండే శ్యామశాస్త్రిగారిని సభలోకి ఎలారప్పించాలనేది సమస్యై కూర్చుంది.
ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకొని,ఆ విద్వాంసులంతా సమష్టిగా శ్యామశాస్త్రిగారి ఇంటికివెళ్లి, విషయం వివరించి,'దీనికి మీరే సమర్థులు.వాసిగన్న మన తంజావూరు ప్రతిష్టను నిలిపే భారం మీదేనని' వేడుకున్నారు.
దేశభక్తులైన శ్యామశాస్త్రిగారు అందుకు అంగీకరించారు.అర్చనానంతరం శ్రీదేవీమాత ముందు సాగిలబడి, తాను రూపొందించిన 'చింతామణి' రాగంలో 'దేవీ! బ్రోవ సమయమిదే!' అన్న కృతి పాడి,అమ్మ ఆశీస్సులు అందుకున్నారు.
మరునాడు ఉదయం రాజాస్థానం, పండితులతోను, ప్రేక్షకులతోనూ నిండిపోయింది.దర్బారులోనికి శ్యామశాస్త్రిగారు వస్తుంటే,కామాక్షీదేవి నడచివస్తున్నట్లుంది.
శరభోజి మహారాజుగారు శ్యామశాస్త్రిగారికి ఎదురేగి,
సాదరంగా ఆహ్వానం పలికారు.పోటీ ప్రారంభమైంది.బొబ్బిలి కేశవయ్యగారు,తంబురా శ్రుతిచేసి,మనోధర్మ అంశాలైన రాగం,తానాలను తన సాధనాబలంతో విభిన్న గతిభేదాలతో పాడి,సభాస్తారులను అచ్చెరువొందించారు.
ఇక,శ్యామశాస్త్రిగారి వంతు.ఆయన అవలీలగా కేశవయ్యగారు చేసిన ప్రక్రియలను చేసిచూపి,ఏనాడూ ఎవరూ వినిఉండని సంచారాలతో, తాళగతులతో రాగ,తాన ప్రస్థారాలుచేసి,అందరినీ సంభ్రమాశ్చర్యాలలో తేలించారు.
నిశ్చేష్టులైన కేశవయ్యగారిని,'ఏమాత్రం శరీరాన్ని కదపక,తలఊపక తానం పాడమని' కోరారు శ్యామశాస్త్రిగారు.చిరకాలంగా తలఊపే అలవాటు కలిగిన కేశవయ్యగారు, ఆపోటీలోనూ ఓడిపోయారు.
ఇక,కేశవయ్యగారు తనకు పేరుతెచ్చిపెట్టిన 'సింహనందన' తాళంలో పల్లవి త్రికాలంలో పాడి, దానిని పాడుమని శ్యామశాస్త్రిగారికి సవాలు విసిరాడు.ఎంతో తేలికగా దానినిపాడి,వినిపించి,దానికి ప్రతిగా 24 అంగముల 'శరభనందన' తాళం సృష్టించి,దానిలో పల్లవి షట్కాలాలు అద్భుతంగా పాడి,దానిని తిరిగిపాడమని కేశవయ్యగారికి సవాలు విసిరారు శ్యామశాస్త్రిగారు.
నిరుత్తరులైన కేశవయ్యగారికి అపుడు అర్థమయింది.'శ్యామశాస్త్రిగారి వెనుక 'ఆదిశక్తి' ఉందని...అహంకారమనే పొర అడ్డుతగలటంతో తాను ఆ విషయం గ్రహించలేకపోయానని..
ఓటమిని అంగీకరిస్తూ,తనవెంట తెచ్చిన కంచు ఢక్కాను పగులగొట్టి,శ్యామశాస్త్రిగారికి జయపత్రం అందించి,వారి పాదాలపై వ్రాలిపోయారు కేశవయ్యగారు.
మహారాజుగారితోపాటు సభాసదులంతా శ్యామశాస్త్రిగారి సంగీత వైదుష్యానికి అంజలి ఘటించారు.బొబ్బిలి కేశవయ్యగారిని పైకిలేపుతూ,శ్యామశాస్త్రిగారిలా అన్నారు:'అమ్మ ప్రసాదించిన సంగీతజ్ఞానాన్ని మోక్ష సాధనకై వినియోగించాలికాని,అహంకరించి,తోటి విద్వాంసులను అవమానించటానికి కాదు.ఇకనుండైనా మీ విద్యను లోకకళ్యాణంకోసం వినియోగించండి'.
శ్యామశాస్త్రిగారు ఎంత ఉన్నత సంస్కారం కలవారంటే,తమ కుమారులైన సుబ్బరాయశాస్త్రిగారికి,త్యాగరాజస్వామి వద్ద సంగీతం చెప్పించారు.తమ మిత్రులైన త్యాగయ్యగారిలో ఒక'సద్గురువు'ను చూశారాయన!
-Modumudi Sudhakar
Comments
Post a Comment