శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ గారు
*ఈరోజు స్వర్గీయ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ గారు జన్మించిన రోజు*
{ వారిని గూర్చి ఒక భక్తురాలి వర్ణణ}
రచయిత : శ్రీమతి లలితా శ్రీ
బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రముఖ శ్రీవిద్యా ఉపాసకులు. వారి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని చందవోలు(చందొలు). శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మరియు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గార్ల ప్రవచనాలలో వారి గురించి విని వారు నివసించిన ఇంటిని దర్శించాలనే కోరిక బలంగా కలిగింది. ఇన్నాళ్ళకి అమ్మ వారి అనుగ్రహంగా ఆ అవకాశం దొరికింది.
కాకినాడ నుండి బెంగుళూరు వెళుతుండగా దారిలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటూ మోపిదేవి అనే సుబ్రహ్మణ్య క్షేత్రం నుంచి చందవోలు గ్రామం చేరుకున్నాం. ఊరి మొదట్లోనే ఉన్న చందవోలు అనే బోర్డు ప్రక్కనే వారు నివసించిన ఇల్లు ఉంది. ఇంటి ప్రక్కనే వారి పేరు మీద ఉన్న వేద పాఠశాల కూడా ఉంది. ఊరిలోని వారికి చందోలు శాస్త్రి గారుగా వారు సుపరిచితులు.
ఇంట్లోకి వెళుతూనే అమ్మవారి స్వరూపమైన ఒక నిండు ముత్తైదువ ఎదురొచ్చారు. వారు శ్రీ శాస్త్రి గారి కోడలు. మేము శాస్త్రి గారి ఇల్లు చూద్దామని వచ్చామని చెబితే ఆవిడ లోపలికి వెళ్ళి ఒకాయనను పిలిచారు. ఆయన శాస్త్రి గారి అబ్బాయట. వారి వయసు సుమారు 75-80 మధ్యలో ఉండి ఉండవచ్చు. వారు కూడా చూడగానే నమస్కరించాలనిపించేలా ఉన్నారు. మేము శాస్త్రి గారి గురించి విని ఆ ఇల్లు చూడాలని వచ్చామని చెప్పాక ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అక్కడే ఉన్న పడక కుర్చీలో కూర్చున్నారు. మేము ఎక్కడి నుంచి వచ్చామో వివరాలు కనుక్కున్నారు. తరువాత సంభాషణ ఇలా జరిగింది:
మీరు శాస్త్రిగారి కుమారులాండీ?
అవును
వారి గురించి కొంచం చెబుతారా
మీరు ప్రవచనంలో వినలేదా?
కొడుకుగా మీ మాటల్లో విందామని అడిగాము.
కొంచం సేపు ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను "మాకు ఈ ఇల్లు చూడాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది కానీ ఇన్నాళ్ళకి అమ్మవారి అనుగ్రహంగా కుదిరింది" అన్నాను. "మంచిది" అన్నారాయన.
మరలా కాసేపు మౌనంగానే ఉన్నారాయన. నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు.
అంతకు ముందే విన్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం గుర్తుకు వచ్చి "వారు ప్రతిష్ఠించిన బాలాత్రిపుర సుందరీ అమ్మవారి మందిరం ఎక్కడ ఉందండీ" అని అడిగాను. "తెనాలిలో గంగానమ్మ గుడి దగ్గరలో ఉంది. వారు నిత్యం అనుష్ఠానం చేసుకున్న పీఠం మాత్రం ఇక్కడే ఉంది. దాని ఆరాధన ఇప్పుడు మేము చేసుకుంటున్నాము. ఈ ప్రక్కనే ఉంది. వెళ్ళి చూసి రావచ్చు" అన్నారు. వారు కొంచం ముభావంగా ఉండడంతో ఆ సమయంలో వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టామా అనే భావం కూడా రాకపోలేదు. సరే చూద్దాంలే అని ఆ అమ్మవారికే చెప్పుకుందాంలే అని లేచి ప్రక్కనే ఉన్న పూజా గది దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొంతమంది పిల్లలు వేదం చదువుకుంటున్నారు. అక్కడి పీఠానికి నమస్కారం చేసుకుని కొన్ని ఫొటోలు తీసుకుని మళ్ళీ వీరి దగ్గరికి వచ్చాము. ఈ సారి మాట్లాడడం మొదలు పెట్టిన వారు సుమారు ఒక గంట సేపు చాలా హాయిగా మాట్లాడారు. మధ్యలో నేను, వారు వ్రాసిన పుస్తకాలు ఏమైనా దొరుకుతాయా అని అడిగితే ఒక 4 పుస్తకాలు అక్కడి అల్మరాలోంచి తీసి ఇచ్చారు. వారి మాటలను ఈ క్రింద పొందుపరుస్తున్నాను:
వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు.
ఒక సారి యమ ధర్మరాజు వారి వద్దకు వచ్చి ధర్మం చెప్పమని అడిగారట. వారు యమునితో "మీరే ధర్మానికి అధిదేవత కదా!నేను మీకు ధర్మం చెప్పడమేమిటి?" అని విస్తుపోయారట. కానీ యముడు "నేను ధర్మంలో వచ్చిన సందేహాలను తీర్చుకోవడం కోసం ఎందరినో కలిసాను. శివుడు, విష్ణువు, దేవతలు అందరినీ కలిసాను కానీ మీరు చెప్పినదే అంతిమంగా అసలైన ధర్మమని మీ వద్దకు వచ్చాను" అన్నారు. వారు యమునితో "నేను ఏమి చెప్పినా శాస్త్రబద్ధంగానే చెబుతాను. నా స్వంత అభిప్రాయాలు ఏవీ చెప్పను. కనుక మీ సందేహాలను అడగండి" అని వారి సంశయాలన్నింటికీ శాస్త్ర ప్రకారం, వేద ప్రమాణంగానూ సమాధానాలను ఇచ్చారు. అంతటి స్థితి వారిది.
వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. (వారు ఆ కొండ పేరు చెప్పారు కానీ నాకు గుర్తు లేదు) సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. శాస్త్రి గారు నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి.
వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా!
తెనాలిలో ఉండే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు వీరికి, కంచి పరమాచార్యకు శిష్యులు. వీరు బ్రాహ్మీభూతులైన తరువాత ఒక సారి వారికి ఈ క్రింది స్వప్నం వచ్చిందట. శాస్త్రి గారు ఒక సారి నరక లోకం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళారట. అక్కడ ఒక పెద్ద బాణలిలో ఏదో బాగా కాగుతూండడం చూచారు. అదేమిటా అని తొంగి చూస్తే నూనె సల సల కాగుతుండగా ఎంతోమంది పాపులు దానిలో తమ పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారు. అయ్యో అని వీరు దానిలోకి చూస్తుండగా వారి నుదుట ఉన్న బొట్టులోని చిన్న గంధం పిసరు అణు మాత్రం ఆ నూనెలో పడింది. వెంటనే సల సల కాగే ఆ నూనె చల్లబడిపోయి దానిలోని పాపులందరికీ పాప పరిహారమైపోయి వారంతా ఆనందంగా పైకి వచ్చేసారట. అది చూచి యమధర్మ రాజు కంగారు పడి, "ఎవరయ్యా ఆయనను ఇక్కడకు తీసుకు వచ్చింది? ఆయనను ఏ స్వర్గానికో తీసుకుపోవాలి కానీ ఇక్కడకు తీసుకు వస్తే ఇక ఇక్కడ మన పనేం కాను? వెంటనే వారిని ఇక్కడి నుంచి తీసుకుపోండి" అని ఆజ్ఞాపించారట. వారు ధరించిన అణుమాత్ర చందనానికే అంతటి పాపాన్ని పోగొట్టగలిగిన శక్తి వచ్చిందంటే, ఇక వారి శరీరమంతా అణువణువూ ఎంత తపశ్శక్తితో నిండి ఉండి ఉంటుందో కదా!
వీరి ధర్మ పత్ని గారు కూడా వీరితో ఈడు జోడైన తపస్సంపన్నులు. వీరు బ్రాహ్మీ భూతులవడానికి 5 సంవత్సరాల ముందే అంటే 1985 లో ఆవిడ స్వర్గస్తులయ్యారు. ఆవిడ కూడా ఎప్పుడూ భగవన్నామం వ్రాసుకుంటూ, పాటలు పాడుకుంటూ వీరి తపస్సుకు సహకరిస్తూ ఉండేవారు. ఆవిడే స్వయంగా కొన్ని పాటలు కూడా వ్రాసేవారట.
తల్లి గారి గురించి చెబుతుండగానే వారి అబ్బాయి ఇలా చెప్పారు" నేను వారి సోదరుని కుమారుడిని. వారు నాకు పెదనాన్నగారు. కానీ నా 7వ యేట నుంచీ నేను వారితోనే ఉన్నాను. వారికి కొంతమంది సంతానం కలిగారు కానీ నష్టపోయారు. ఒక కుమార్తె మాత్రం ఉన్నారు" అని చెప్పారు.
వారు మాతో ఇంకా ఇలా అన్నారు: "శాస్త్రిగారికి ఈ శక్తంతా వారి తపస్సు వల్ల వచ్చింది. అది ఒక్క జన్మలో సాధ్యమయ్యేది కాదు. ఎన్నో జన్మలు సాధన చేస్తే గానీ ఆ స్థితిని చేరుకోలేం. కనుకనే మనమందరం కూడా నిత్యం ఏదో ఒక రూపంలో తపస్సు అంటే భగవదారాధన చేస్తూనే ఉండాలి. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. నిత్యం మనం ఏమి తింటున్నా అది భగవంతునికి అర్పించి తింటే అది మహా ప్రసాదమవుతుంది. పురుష ప్రయత్నంగా మన ధర్మం నెరవేరుస్తూ మన తపస్సు కొనసాగిస్తూ ఉంటే తప్పక భగవదనుగ్రహం కలిగి మంచి స్థితిని చేరుకోగలం.
వారి మాటల ద్వారా వారు జ్యోతిష శాస్త్రంలో కూడా ప్రవీణులని అర్థమయ్యింది. తరువాత వారు మా కుటుంబం గురించి కొంత అడిగి, వారి భార్యను పిలిచి నాకు కుంకుమ ఇమ్మన్నారు. ఆవిడ నాకు బొట్టు, పండు ఇవ్వగా, మేము వారికిరువురికీ దూరం నుంచే నమస్కరించుకున్నాం. వారు మమ్మల్ని ఆశీర్వదించి పంపారు. మనసంతా అంతులేని సంతోషంతో నింపుకుని మరల మరల ఆ పరిసరాలంతా చూస్తూ నమస్కరించుకుంటూ వెనుతిరిగి వచ్చాము.
ఇంతటి అవకాశాన్ని ఇచ్చి అనుగ్రహించిన అమ్మవారి కృపకు జన్మంతా కృతజ్ఞులమై ఉండేటట్లుగా కూడా ఆ అమ్మవారే అనుగ్రహించాలని కోరుకుంటున్నాము.
ఆ పరిసరాలలో తీసిన కొన్ని ఫొటోలు ఇక్కడ ఉంచడం ద్వారా మీరు కూడా ఆ సన్నిధిలో ఉన్న భావనను పొంది ఆనందంచగలరని ఆశిస్తున్నాను.
రచయిత : శ్రీమతి లలితా శ్రీ గారు
బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రతిష్టించిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి తెనాలి లో ఉన్నది.గంగానమ్మ పేట లో గంగానమ్మ గుడి వీదిలో శివాలయానికి ఎదురుగా ఈ గుడి ఉన్నది.
temple address : Ganganamma pet, on Ganganamma Gudi lane (famous one) and opp to sivalayam temple - bala tripura sundari temple. Near to Bus stand
బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రతిష్టించిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం తెనాలి లో ఉన్నది.గంగానమ్మ పేట లో గంగానమ్మ గుడి వీదిలో శివాలయానికి ఎదురుగా ఈ గుడి ఉన్నది.
temple address : Ganganamma pet, on Ganganamma Gudi lane (famous one) and opp to sivalayam temple - bala tripura sundari temple. Near to Bus stand .
బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు వశించిన గృహం చెందోలులో ఉన్నది.అడ్రస్ సరిగ్గా తెలియడం లేదు కాని చెందోలు కూ వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారని అంటున్నారు.చెందోలు తెనాలి నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది .ఇందలో కలిపిస్తున్నదే ఆలయం , అందులో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిచే ప్రతిష్టింపబడిన అమ్మవారి మూలవిరాట్టు.
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ గురుభ్యో నమః
Comments
Post a Comment