ప్రదక్షిణ ప్రాముఖ్యత


శ్రీ రమణ మహర్షి 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు.
ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.
ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగిమ్చుకోగలం. అంతే కాదు. అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం.
"విశ్వమంతా తిరిగి శీఘ్రంగా ప్రదక్షిణ చేసి వచ్చిన వానికే గణాధిపత్యం" అని పార్వతీ పరమేశ్వరులు షరతు విధించినపుడు కుమారస్వామి మయూర వాహనంపైనెక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయలు దేరాడు. మూషిక వాహనుడైన మహాగణపతి అలా వెళ్ళలేకపోయాడు. కానీ, తెలివిగా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చిత్రంగా సుబ్రహ్మణ్యుడు వెళ్ళిన ప్రతి చోటా అంతకు మునుపే గణపతి వచ్చి వెళ్ళిన జాడలు కనిపించాయి. ముందుగా విశ్వాన్ని చుట్టి వచ్చిన వాడు వినాయకుడేనని నిర్ణయించి- శివుడు, ఇతర దేవతలు అతనికే గణాధిపత్యాన్ని ఇచ్చారు. కుమారస్వామి అలకను తీర్చి పార్వతీ పరమేశ్వరులు బుజ్జగించారు.
అయితే ఈ కథలో కుమారస్వామి, గణపతి లలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిష్కరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించాలన్నది సుబ్రహ్మణ్యుని బోధ.
దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటే ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటే ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము మరియు సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రథమని చెప్పబడింది.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas